New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మహారాణా ప్రతాప్ – 2

మహారాణా ప్రతాప్ – 2

రెండవ భాగం :


మేవార్ రాజ్యం :

భారతదేశం :

కొన్ని వందల సంవత్సరాల క్రితం :

క్రీస్తుకు చాలా శతాబ్దాల పూర్వం మేవార్ లో ప్రజా జీవితం ఉనికిలో ఉండేదని చాలా ఋజువులు ఉన్నాయి. మేవార్ నదుల ఒడ్డున మానవ స్థావరాలు ఉన్నాయి అనేది నిజం. మేవార్ చరిత్ర చాలా పురాతనమైనది.

మేవార్ చాలా విశాలమైన రాజ్యం. ఈ మేవార్ రాజ్యం భారతదేశం లోని భౌగోళిక స్థానం 23.49 నుండి 25.58 ఉత్తర అక్షాంశం లో మరియు 73.1 నుండి 75.49 వరకు దక్షిణ రేఖాంశం వద్ద ఉంది. ఈ మేవార్ రాజ్యాన్ని నాలుగు సహజ మండళాలుగా విభజించవచ్చు. .

పశ్చిమ పర్వత శ్రేణి, తూర్పు పర్వత శ్రేణి, దక్షిణ పర్వత శ్రేణి మరియు మధ్య మైదానాలు. . పశ్చిమ పర్వత శ్రేణి ఉత్తరం నుండి మొదలై దక్షిణాన దేవాల్ అనే ప్రాంతం వరకు చేరుకుంటుంది.

 

ఈ పర్వత శ్రేణినే ఆరావళి పర్వతలుగా పిలుస్తారు. ఈ ఎత్తైన ఆరవళి పర్వతాల శిఖరం కుంబల్ ఘర్ ప్రాంత సమీపంలో జార్గా అనే ప్రదేశంలో ఉంటుంది. దీని ఎత్తు సమద్ర మట్టానికి 4315 అడుగుల ఎత్తులో ఉంటుంది.

 

ఈ పర్వతాలలో అనేక ఇరుకైన గుహలు ఉన్నాయి. వీటిని నాల్ అని పిలుస్తారు. బయటి నుండి లోపలి వైపు భాగానికి శత్రువులు చొరబడకుండా ఈ నాల్ లో భద్రతా ఏర్పాట్లు చేస్తారు.

మేవర్ లోని ఒక వైపు భూభాగాన్ని మేవాల్ అని, రెండవ వైపు భూభాగాన్ని మేర్వార్ అని పిలుస్తారు. నిజానికి మేవార్ ని మేవాడ్ అని కుడా పిలుస్తారు. రాజ్ సముద్రా, పిచ్చోలా, ఫతేసాగర్ మరియు స్వరూప్ సాగర్ అనే సరస్సులు మేవార్ ప్రాంతం అంతటా విస్తరించి ఉన్నాయి.

మేవార్ రాజ్య ఉత్తర ప్రదేశం ఏటవాలుగా ఉంటుంది. అక్కడ బనస్ అనే నది మరియు బేరచ్ అనే ఉపనదులు ప్రవహిస్తున్నాయి. యమునా నదికి ఉపనది అయిన చంబల్ నది ఈ రాజ్యానికి వాయువ్య ప్రాంతంలో ప్రవహిస్తోంది.

 

దక్షిణ ప్రాంతం పర్వతమయంగా ఉండి, బనస్ అనే నది, దాని ఉపనదులను విడదీస్తోంది. ఈ ప్రాంతం నుంచే సబర్మతీ, మహీ నదులు మరియు వాటి ఉపనదులూ గుజరాత్ రాష్ట్రంలోని ఖంభట్ అనే ప్రాంతంలోకి ప్రవహిస్తాయి.

 

ఈ రాజ్యానికి వాయువ్య దిశలో ఆరావళీ పర్వతాలు సహజ సరిహద్దుగా ఉంటాయి.

ఆరవ శతాబ్దంలో ఈ మేవార్ భూమిపై తమ రాజ్యాన్ని స్థాపించి సరికొత్త రాజవంశానికి పునాదులు వేసిన మొదటి రాజు గుహదిత్య. ఇతను ఈ రాజవంశానికి మొదటి పాలకుడు. అందువల్ల ఈ రాజవంశాన్ని గుహిల్ లేదా గుహిలోట్ రాజ వంశం అని పిలిచేవారు.

 

ఈ రాజవంశం యొక్క శాఖలలో ఒకటి అయినా సిసోడియా రాజ వంశంగా కూడా పిలిచేవారు.

గుహదిత్య బాలమి రాష్ట్రానికి చెందిన వాడు. అతను తన తండ్రి మరణించిన తరువాత అతని అనుచరులతో ఆ ప్రాంతాన్ని వదిలి పెట్టి, అక్కడి నుండి ఈదార్ మీదుగా నాగ్డా చేరుకున్నాడు.

 

అప్పుడు అతనికి తెలిసిన ఒక రాజ్యం మేవార్. అందువల్ల తన అనుచరులతో కలిసి అక్కడి నుండి మేవార్ పై దండయాత్ర చేసి మేవార్ ని గెలుచుకున్నాడు.

 

మేవార్ రాజ్యాన్ని కైవసం చేసుకున్న తర్వాత తన సిసోడియా రాజ వంశాన్ని స్థాపించాడు గుహదిత్య.

ఈ సిసోడియా రాజ వంశం సూర్యవంశం కోవకు చెందినది. ఈ రాజవంశం సాంప్రదాయకంగా ‘ఇక్ష్వాకు కుల తిలకుడు‘ అయిన శ్రీ రామ చంద్ర మూర్తి పుత్రులలో ఒక్కరు అయినా కుశుడు సంతతిగా సూర్య వంశాన్ని సిసోడియా రాజవంశంగా కొనసాగిస్తున్నారు!

గుహదిత్య తరువాత ఈ మేవార్ ని పరిపాలించిన గొప్ప రాజు అయినా బప్పా రావల్ కూడా ఈ రాజ వంశం నుండి వచ్చాడు . చిత్తోర్ రాజు అయిన రాజా మాన్ సింగ్ ని ఓడించి చిత్తోర్ ని గెలుచుకున్నాడు. ఈ విధంగా చిత్తోర్ కూడా మేవార్ రాజ్యంలో భాగం అయింది.

బప్పా రావాల్ పాలన క్రీస్తు శకం 734 నుండి 753 వరకు జరిగింది. విదేశీ అరబ్ రాజులు భారతదేశంపై దండయాత్ర చేసినపుడు తన మాతృభూమిని తన  ధైర్యసాహసాలతో రక్షించిన గొప్ప వీరుడు బప్పా రావాల్.

 

అతని తరువాత అతని వారసుడు ఖుమానా మేవార్ రాజ్యాన్ని పాలించాడు. 812 నుండి 836 వరకు వారి పాలన కొనసాగింది.

ఖుమానా పరిపాలన అనంతరం అతని వారసులు పరిపాలన కొనసాగించారు. 1191 లో మేవార్ కి సుమెర్ సింగ్ రాజుగా పరిపాలన మొదలు పెట్టారు. ఈ సమయాన షాహబుద్దీన్ ఘోరీ భారతదేశంపై దండయాత్ర చేశాడు.

 

సుమెర్ సింగ్ యొక్క ఎనిమిదవ వారసుడు అయినా రావల్ రతన్ సింగ్ మేవార్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించి పరిపాలన చేయడం మొదలు పెట్టాడు. రతన్ సింగ్ భార్య పేరు నాగ మతి.

 

ఒకరోజు రావల్ రతన్ సింగ్ కి సింహాల రాజ్యం నుండి స్వయంవరానికి ఆహ్వాన పత్రం అందింది. దాంతో సింహాల రాజ్యానికి బయలుదేరాడు రావల్ రతన్ సింగ్.

 

◆ ◆ ◆ ◆ ◆ ఇంకా ఉంది ◆ ◆ ◆ ◆ ◆

 

ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలతో నన్ను ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు! మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’