New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మహారాణా ప్రతాప్ – 3

మహారాణా ప్రతాప్ – 3

మూడవ భాగం :

సింహాళ రాజ్యం: (శ్రీలంక)

సింహాల రాజ్యాన్ని గంధర్వ సేన్ పరిపాలిస్తున్నాడు. అతని భార్య చంపావతి. వీళ్ళిద్దరి పుత్రిక యువరాణి పద్మిని దేవి. ఈ పద్మిని దేవి కి మరోపేరు పద్మావతి.

అక్కడ రాజ్య ప్రజలకు ఎప్పుడు పద్మిని దేవి కనిపించిన అక్కడున్న వారందరి కళ్ళన్నీ పద్మిని దేవి పైనే ఉండేవి. అంతటి అందం తన సొంతం.

 

తన పదహారవ యేట జరిగిన పుట్టినరోజు నాడు దేశంలోని వివిధ రాజ్యాల నుండి బహుమతులు లభించాయి. అందులో ఒక మాట్లాడే చిలుక యువరాణి పద్మిని దేవికి చాలా నచ్చింది.

 

ఆ చిలుక కి హిరణ్య మణి అనే పేరును పెట్టింది పద్మిని దేవి. అలా చాల రోజుల తరువాత తన కూతురికి వివాహం జరిపించాలనే ఉద్దేశంతో గంధర్వ సేన్  స్వయంవరాన్ని ఏర్పాటు చేసి వివిధ రాజ్యాల రాజులను, రాజ్ పుత్ రాజులను మరియు క్షత్రియ రాజులను ఆహ్వానించాడు.

ఆహ్వానాన్ని స్వీకరించి రావల్ రతన్ సింగ్ ఆ స్వయంవరానికి విచ్చేసారు. రాజులందరూ కూడా తమ వంశాన్ని పెంచుకోవడానికి అనేక వివాహాలు చేసుకునేవారు. స్వయంవరం లో తన ప్రత్యర్థి అయిన మల్కాన్ సింగ్ ని ఓడించి విజయం సాధించాడు రావల్ రతన్ సింగ్.

 

గంధర్వ సేన్ తన కూతురు అయిన పద్మిని దేవి ని రతన్ సింగ్ కి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. తన సంపదలో సగ భాగాన్ని కూడా వివాహ కానుకగా ఇచ్చాడు గంధర్వ సేన్.

చిత్తోర్ ఘర్ :

రతన్ సింగ్ లాంటి భర్త దొరకడం రాణీ పద్మిని దేవి గత జన్మ వరంగా భావించింది. రతన్ సింగ్ కి కళ మీద మక్కువ ఎక్కువ. అందుకే తన భవనంలో కళాకారులు ఎక్కువగా ఉండేవారు.

 

ఆ కళాకారులలో ఒకడు రాఘవ్ చేతన్. ఇతను ఒక సంగీత విద్వాంసుడు. అతను మురళీ గానాన్ని వాయించడం మొదలు పెడితే ఎంతటి వారైనా రాఘవ్ చేతన్ ని ప్రశంసించకుండా ఉండలేరు.

 

రాఘవ్ చేతన్ మురళీగానం వాయించడంతో పాటు క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటాడు అని రాజ్య ప్రజలకు తెలిసింది. ఆ వార్త ఆ నోటా ఈ నోటా పడి రాజు అయిన రతన్ సింగ్ చెవిన పడింది.

ఇక రాజు అయిన రతన్ సింగ్ తన రాజ్యం నుంచి రాఘవ్ చేతన్ ని బహిష్కరించాడు. ప్రజల అందరి ముందు అవమానాన్ని అనుభవించిన రాఘవ్ చేతన్, రతన్ సింగ్ పై కక్షతో ఆ రాజ్యాన్ని వదిలి పెట్టాడు.

 

రతన్ సింగ్ ని ఎలాగైనా దెబ్బతీయాలని భావించాడు. కాని అది అంత తేలికైన విషయం కాదు అని రాఘవ్ చేతన్ కి తెలుసు.

 

ఎందుకంటే రాజ్ పుత్ రాజుల శౌర్య పరాక్రమాలు ఎప్పటినుండో చూస్తున్నాడు రాఘవ్ చేతన్. అందువల్ల అతని కంటే పరాక్రమవంతుడు అయిన వారి కోసం వెతకడం మొదలుపెట్టాడు.

 

ఆ సమయంలో రాఘవ్ చేతన్ కి ఢిల్లీకి సుల్తాన్ అయిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ వీరత్వం మరియు అతని సైనిక బలం గురించి తెలిసింది.

 

రతన్ సింగ్ ని మట్టుపెట్టడం కేవలం ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ కే సాధ్యమని ఢిల్లీకి బయలుదేరారు.

1296 సంవత్సరంలో సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ తన మామ అయిన జలాలుద్దీన్ ని దారుణంగా హతమార్చి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. అతనికి అమితమైన రాజ్యకాంక్ష మరియు అధికార దాహం ఉండేది.

 

అసంఖ్యాకమైన ఏనుగులు, 70 వేల అశ్వాల తో గొప్ప సైనిక బలం తోడు కావడంతో, తను అడుగు పెట్టిన ప్రతీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, కనిపించిన ప్రతీ సంపదను దోచుకోవాలి అనే పేరాశ అతనిలో పెరిగిపోయింది.

తన రాజ్యాన్ని విస్తరిస్తూ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఓడించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.

అలాంటి బలగం ఉన్న అల్లా ఉద్దీన్ ఖిల్జీని రతన్ సింగ్ పైకి ఉసిగొలిపితే తన కక్ష తీరుతుందని పన్నాగం పన్నాడు రాఘవ చేతన్. కానీ లక్షల మంది సైన్యం, కోట్ల కొద్దీ సంపద అల్లాఉద్దీన్ ఖిల్జీ సొంతం.

 

అంతటి రాజు ని కలవడం రాఘవ్ చేతన్ కి అంత సులభం కాదని అర్థమైంది. కాని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు రాఘవ్ చేతన్.

అల్లాఉద్దీన్ ఖిల్జీ తరచుగా వేటకు అరణ్యం లో కి వెళ్తాడు. ఆ విషయం తెలిసి, తనని కలవడానికి అరణ్యమే సరైన మార్గం అని భావించిన రాఘవ చేతన్, ఆ అరణ్యం లో ఎదురు చూస్తున్నాడు. ఎప్పటిలాగే అల్లా వుద్దీన్ ఖిల్జీ అడవికి రావడం, అదే సమయంలో రాఘవ్ చేతన్ తన మురళీగానం మొదలుపెట్టడం, ఆ మురళి గానానికి అల్లా ఉద్దీన్ ఖిల్జీ దాసోహం అవ్వడం, రాఘవ్ చేతన్ ని తన రాజ్యానికి ఆహ్వానించడం జరిగింది.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ కోటకు చేరినప్పటి నుంచి రతన్ సింగ్ ని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అనే విషయం పైనే ఆలోచించసాగాడు రాఘవ్ చేతన్. అందుకు రతన్ సింగ్ భార్య అయిన రాణీ పద్మిని దేవి అందచందాల గురించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ కి చెప్పడం మొదలు పెట్టాడు.

రాణీ పద్మిని దేవి సౌందర్యం గురించి ప్రతి రాజ్యం చెప్పుకునే అంత అందంగా ఉంటుంది. నీరు తాగినా గొంతులో కనిపించేంత లేత బంగారు మేనిఛాయ కలిగి, ఆమె సుమనోహర సుందర రూపాన్ని తిలకించడానికి సూర్యచంద్రులు సైతం క్షణం ఆగి వెళ్తారు. ఆమె సౌందర్యం గురించి చాలామంది కవులు చాలా గొప్పగా చెబుతూ ఉండేవారు.

ప్రతిరోజు, ప్రతి మాట రాణి పద్మిని దేవి గురించి చెబుతూ ఉండేవాడు రాఘవ్ చేతన్. రాణీ పద్మిని దేవి అందం గురించి విన్న అల్లా ఉద్దీన్ ఖిల్జీ, మాటలలోనే ఇంత అందం ఉందంటే, ఆ రాణి ని ఎదురుగా చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అని, తన సొంతం చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అని ఆలోచించి, ఎలాగైనా రాణీ పద్మిని దేవిని తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

◆ ◆ ◆ ◆ ◆ ఇంకా ఉంది ◆ ◆ ◆ ◆ ◆

ఈ భాగం చదివిన తరువాత మీ విలువైన సమీక్షలతో నన్ను ప్రోత్సాహించి, సబ్స్క్రయిబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

మీ రాజేష్ తొగర్ల ‘ఇక్ష్వాకు🏹’