New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీటి మీద సంతకం 💧🖋️ – 1

నీటి మీద సంతకం 💧🖋️ – 1

ఇండియా లోని మారుమూల గ్రామం అయినా వెలుగుపల్లి గ్రామంలో తెల్లవారుజామున ఐదు గంటలకే అక్కడున్న ప్రజల జీవితం మొదలవుతుంది.

 

కోడి కూయకముందే కొన్ని ఇళ్లలో పొయ్యిలు వెలుగుతాయి. మరికొన్ని ఇళ్లలో నుంచి నీళ్ల బిందెలు పట్టుకుని మహిళలు వీధుల్లోకి వస్తారు. ఊరి చివరన ఉన్న చేతిపంపు దగ్గర అప్పటికే ఇద్దరు ముగ్గురు నిలబడి ఉంటారు. ఎవరి ఇంట్లో ఎన్ని బిందెల నీళ్లు అవసరమో, ఎవరు ముందుగా వచ్చారో అన్న విషయాల మీద చిన్నచిన్న మాటలు మొదలయి, చర్చలు గా కొనసాగుతాయి.

 

ఆ గ్రామంలో ప్రతి ఉదయం ఇలాగే మొదలవుతుంది.

 

కానీ ఆ రోజు మాత్రం గ్రామంలోని ఒక చిన్న ఇంట్లో మరో ప్రపంచం మేల్కొంటోంది.

 

“అమ్మా! ఇంకో ఐదు నిమిషాలు పడుకుంటాను.”

 

అంటూ దుప్పటిని ముఖం మీదకు లాక్కుంటూ చెప్పింది వైదేహి.

 

“ఐదు నిమిషాలా? ఇప్పటికే ఆరు గంటలు కావస్తుంది. చదువుకోవడానికి మాత్రం రాత్రంతా మెలకువగా ఉంటావు. ఇంటి పనులు చేయమంటే మాత్రం నిద్రొస్తుంది.”

 

వంటగదిలో నుంచి తల్లి లక్ష్మమ్మ గొంతు గట్టిగ వినిపించింది.

 

వైదేహి నవ్వుకుంటూ దుప్పటిని పక్కకు తీసి చూసింది.

 

“అమ్మా, నిన్న గణితంలో ఒక ప్రశ్న అర్థం కాలేదు. అది పూర్తి చేసేసరికి ఆలస్యమైంది.” అంటూ చెప్పుకొచ్చింది వైదేహి.

 

“నీకు ఆ పుస్తకాలే లోకం. ముందు లేచి ముఖం కడుక్కుని రా. నీ నాన్న పొలానికి వెళ్లాలి. ఆయనకు అన్నం పెట్టాలి.”

 

“వస్తున్నాను అమ్మా!”

 

వైదేహి చురుగ్గా లేచి పుస్తకాలను సర్దిపెట్టి, మంచం కింద పెట్టిన చిన్న పెట్టెను తెరిచింది. అందులో కొన్ని తన పాత బహుమతి పత్రాలు, ఒక చిన్న కలం, ఎంతో జాగ్రత్తగా దాచుకున్న పాఠశాల గుర్తింపు పత్రం ఉన్నాయి.

 

ఆ పత్రాన్ని చేతిలోకి తీసుకుని కాసేపు చూసింది.

 

ఆమెకు చదువంటే ఇష్టం మాత్రమే కాదు. చదువే తన జీవితాన్ని మార్చగలదని నమ్మకం.

 

వైదేహి పదో తరగతి చదువుతోంది. అది ఊరిలోని ఉన్న ఒక్కగానొక పాఠశాల కావడం తో పిల్లలు ఎప్పుడు నిండుగా ఉంటారు. వైదేహి చదువు విషయంలో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునేది. ముఖ్యంగా తెలుగు, గణితం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. తరగతిలో ఉపాధ్యాయులు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి ముందుండేది.

 

ఒకరోజు తెలుగు ఉపాధ్యాయురాలు శాంతమ్మ తరగతిలో అడిగిన ప్రశ్న ఆమె జీవితంలో ఇప్పటికీ గుర్తుంది.

 

“పిల్లలూ! మీరందరూ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు?”

 

ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెప్పారు.

 

“డాక్టర్ అవుతాను టీచర్!”

 

“పోలీసు అవుతాను!”

 

“నేను కలెక్టర్ అవుతాను!”

 

చివరగా శాంతమ్మ వైదేహి వైపు చూసింది.

 

“వైదేహి, నువ్వేం అవుతావు?”

 

ఆమె ఏమాత్రం ఆలోచించకుండా లేచి నిలబడింది.

 

“నేను టీచర్ అవుతాను అమ్మా. మా ఊరిలో చాలా మంది పిల్లలు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. వాళ్లందరికీ చదువు చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని నా కోరిక.”

 

ఆ మాటలు విన్న శాంతమ్మ ముఖంలో చిన్న చిరునవ్వు విరిసింది.

 

“నీకు ఆ కల నెరవేర్చుకునే తెలివి ఉంది వైదేహి. కానీ తెలివి ఉంటే సరిపోదు. కష్టాలు వచ్చినప్పుడు కూడా నీ లక్ష్యాన్ని వదులుకోకూడదు.”

 

ఆ మాటలను వైదేహి తన మనసులో భద్రపరుచుకుంది.

 

అప్పటికి ఆమెకు తెలియదు. తన కలను కాపాడుకోవడానికి ఒకరోజు తన జీవితాన్నే ఎదిరించాల్సి వస్తుందని.

 

వైదేహి ఇంటి పరిస్థితులు అంతంత మాత్రమే.

 

తండ్రి నరసింహం చిన్న రైతు. తమకున్న కొద్దిపాటి పొలంలో పంట పండితే కుటుంబం గడుస్తుంది. లేకపోతే అప్పులు చేయాల్సిందే. గత రెండేళ్లుగా పంట సరిగ్గా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి.

 

తమ్ముడు కార్తీక్ ఇంకా చిన్నవాడు. అతని చదువు, ఇంటి ఖర్చులు, పొలానికి సంబంధించిన అవసరాలు అన్నీ నరసింహం భుజాల మీదే ఉన్నాయి.

 

వైదేహి చదువును ఆపేయాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. కానీ పరిస్థితులు ఆయనను నెమ్మదిగా ఆ దిశగా నెట్టసాగాయి.

 

ఆ ఉదయం భోజనం చేస్తూ నరసింహం మౌనంగా ఉండటం వైదేహి గమనించింది.

 

“ఏమైంది నాన్నా? ఏదైనా సమస్యా?”

 

“ఏమీ లేదమ్మా.”

 

“నాతో చెప్పకూడదా?”

 

నరసింహం ఆమె వైపు చూశాడు.

 

“నీ పరీక్షలు ఎప్పుడు?”

 

“వచ్చే నెలలో నాన్నా.”

 

“బాగా చదువుకో. నువ్వు మంచి ఉద్యోగం సంపాదిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి.”

 

ఆ మాటలు విన్న వైదేహి ముఖం వెలిగిపోయింది.

 

“నిజంగానా నాన్నా? నేను టీచర్ ఉద్యోగం సంపాదిస్తాను. నీకు, అమ్మకు ఇక కష్టాలు లేకుండా చూసుకుంటాను.”

 

నరసింహం నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక దాచుకున్న ఆందోళనను ఆమె గుర్తించలేదు.

 

ఎందుకంటే అంతకుముందు రాత్రి ఆయనకు ఒక సంబంధం గురించి సమాచారం వచ్చింది.

 

అబ్బాయి పేరు రవీందర్. అదే ప్రాంతానికి చెందిన కుటుంబం. వ్యవసాయంతో పాటు చిన్న వ్యాపారం కూడా ఉంది. కుటుంబం గ్రామంలో గౌరవంగా ఉంటుందని మధ్యవర్తి చెప్పాడు.

 

వైదేహికి పెళ్లి వయసు వచ్చిందని, ఇప్పుడు సంబంధం కుదిరితే భవిష్యత్తులో కట్నం కోసం ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని అతను నరసింహానికి నచ్చజెప్పాడు.

 

నరసింహం మొదట నిరాకరించాడు.

 

“నా అమ్మాయి ఇంకా చదువుకుంటోంది. చదువు పూర్తయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తాను.”

 

కానీ మధ్యవర్తి మాటల్లో మరో మాట…

 

“ఇప్పుడే మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్లు ఎక్కువగా ఏమీ అడగడం లేదు. పైగా మీ అప్పుల సంగతి తెలిసినా సంబంధానికి ఒప్పుకుంటున్నారు. ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందో రాదో!”

 

ఆ మాట నరసింహాన్ని ఆలోచనలో పడేసింది.

 

అప్పుల బాధ, కూతురి భవిష్యత్తు గురించి భయం, సమాజం మాటలు—అన్నీ కలిసిపోయాయి.

 

అయినా ఆయన తుది నిర్ణయం తీసుకోలేకపోయాడు.

 

ఆ రోజు సాయంత్రం వైదేహి పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఇద్దరు మహిళలు కూర్చుని ఉన్నారు. తల్లి వాళ్లకు టీ ఇస్తోంది. తండ్రి కొత్త బట్టలు వేసుకుని వాళ్లతో మాట్లాడుతున్నాడు. పక్కనే తమ్ముడు ఎవరు మాట్లాడితే వాళ్ల వైపు అటు ఇటు చూస్తున్నాడు 

 

వైదేహి లోపలికి అడుగుపెట్టగానే తల్లి ఆమెను పిలిచింది.

 

“వైదేహి, ఇటు రా.”

 

ఆమె వచ్చి నిలబడింది.

 

“ఈ అబ్బాయి వాళ్లు నిన్ను చూడటానికి వచ్చారు. బాగా చదువుకున్నాడట. కుటుంబం కూడా మంచిదట.”

 

వైదేహికి మొదట ఆ మాటల అర్థం కాలేదు.

 

“ఎవరు అమ్మా?”

 

“నీకు సంబంధం వచ్చింది.”

 

ఆ ఒక్క వాక్యం ఆమె చెవుల్లో మారుమోగింది.

 

చేతిలోని పుస్తకాలు జారి కిందపడ్డాయి.

 

“సంబంధమా? నాకు?”

 

నరసింహం తలదించుకున్నాడు, కానీ వెంటనే 

 

“అమ్మా, ఒక్కసారి వాళ్లను చూసి మాట్లాడితే తప్పేముంది?”

 

“నాన్నా, నాకు ఇంకా చదువు పూర్తి కాలేదు కదా!”

 

ఆమె గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపించింది.

 

“చదువు తర్వాత కూడా పూర్తిచేసుకోవచ్చు.”

 

“ఎలా నాన్నా? పెళ్లి చేసుకున్నాక ఎలా చదువుకుంటాను? నాకు టీచర్ కావాలని చెప్పాను కదా!”

 

లక్ష్మమ్మ వెంటనే కలగజేసుకుంది.

 

“అలా అనకూడదు వైదేహి. ప్రతి అమ్మాయికీ పెళ్లి చేయాల్సిందే. పెళ్లయ్యాక భర్త సహకరిస్తే చదువుకోవచ్చు.”

 

“అతను సహకరిస్తాడని ఎవరు చెప్పారు అమ్మా? నేను అతన్ని చూసింది కూడా లేదు.”

 

ఆ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు.

 

ఆ రాత్రి వైదేహి అన్నం తినలేదు.

 

తన పుస్తకాలను ఒడిలో పెట్టుకుని కూర్చుంది. రేపు పాఠశాలకు వెళ్లి శాంతమ్మకు చెప్పాలని అనుకుంది. కానీ తన తండ్రి అప్పుల గురించి గుర్తొచ్చింది. ఆయన తన కోసం ఎంత కష్టపడుతున్నాడో కూడా తెలుసు.

 

తన కల కోసం తండ్రిని బాధపెట్టాలా?

 

లేక తండ్రి బాధను తగ్గించడానికి తన కలను వదులుకోవాలా?

 

ఆమెకు ఏదీ అర్థం కాలేదు.

 

రెండు రోజుల తర్వాత రవీందర్ కుటుంబం మళ్లీ వచ్చింది.

 

వైదేహి అందరికీ టీ ఇచ్చి లోపలికి వెళ్లబోతుండగా రవీందర్ తల్లి సుబ్బమ్మ పిలిచింది.

 

“అమ్మాయీ, ఇటు రా. నీతో కొంచెం మాట్లాడాలి.”

 

వైదేహి తలదించుకుని కూర్చుంది.

 

“చదువుకుంటున్నావట కదా?”

 

“అవును.”

 

“ఎంతవరకు చదువుతావు?”

 

“టీచర్ ఉద్యోగం వచ్చే వరకు చదవాలనుకుంటున్నాను.”

 

సుబ్బమ్మ ఒకసారి తన కొడుకు వైపు చూసింది. రవీందర్ మౌనంగా ఉన్నాడు.

 

“పెళ్లయిన తర్వాత ఇంటి బాధ్యతలు ఉంటాయి కదమ్మా. అయినా మా ఇంట్లో నీకు ఏ కష్టం ఉండదు. మా అబ్బాయి మంచివాడు.”

 

వైదేహి రవీందర్ వైపు చూసింది.

 

అతను ఆమెను ఒకసారి చూసి చిన్నగా నవ్వాడు.

 

ఆ నవ్వులో ఆమెకు భరోసా కనిపించలేదు. అలా అని వ్యతిరేకత కూడా కనిపించలేదు.

 

ఆమె మనసులో ఒక చిన్న ఆశ పుట్టింది.

 

బహుశా అతను తన చదువును కొనసాగించడానికి అనుమతిస్తాడేమో.

 

ఆమెకు తెలియదు—తన జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆమె అభిప్రాయానికి ఎంత తక్కువ విలువ ఇవ్వబడబోతోందో.

 

ఆ రాత్రి నరసింహం వైదేహి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

 

“అమ్మా, ఒక విషయం అడగాలి.”

 

వైదేహి పుస్తకాన్ని మూసేసి ఆయన వైపు తిరిగి చూసింది.

 

“చెప్పు నాన్నా.”

 

“నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పు. నేను ఆలోచిస్తాను.”

 

ఆ మాట విన్న వైదేహి కళ్లలో నీళ్లు తిరిగాయి.

 

“నాన్నా, నాకు ఇప్పుడు పెళ్లి వద్దు. ముందు చదువుకోవాలి. నువ్వు నన్ను చదివిస్తానని మాటిచ్చావు కదా!”

 

నరసింహం కూతురి చేతిని పట్టుకున్నాడు.

 

“నాకు తెలుసమ్మా. కానీ మన పరిస్థితులు నీకు తెలియవు. అప్పులు పెరిగిపోతున్నాయి. నీ భవిష్యత్తు గురించి భయంగా ఉంది.”

 

“నేను ఉద్యోగం సంపాదిస్తాను నాన్నా. ఇంకొంచెం సమయం ఇవ్వు.”

 

ఆయన సమాధానం చెప్పలేకపోయాడు.

 

వైదేహి ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది.

 

“నన్ను చదివించు నాన్నా. నేను నిన్ను ఎప్పటికీ బాధపెట్టను.”

 

నరసింహం ముఖం తిప్పుకున్నాడు.

 

ఆమెకు సమాధానం ఇవ్వలేకపోయాడు.

 

ఆ మౌనమే వైదేహికి మొదటి భయాన్ని కలిగించింది.

 

రోజులు గడిచాయి.

 

ఒక ఉదయం వైదేహి పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా తల్లి ఆమె గదిలోకి వచ్చింది.

 

“బడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండు.”

 

వైదేహి ఆశ్చర్యంగా చూసింది.

 

“ఎందుకు అమ్మా?”

 

లక్ష్మమ్మ కళ్లలోకి చూడలేకపోయింది.

 

“పెళ్లి నిశ్చయమైంది.”

 

వైదేహి చేతిలో ఉన్న పుస్తకం నెమ్మదిగా కిందకు జారింది.

 

“ఏమన్నావమ్మా?”

 

“వచ్చే నెలలో పెళ్లి. అబ్బాయి వాళ్లు ముహూర్తం కూడా పెట్టించారు.”

 

“నాన్న ఒప్పుకున్నాడా?”

 

తల్లి మౌనంగా తల ఊపింది.

 

వైదేహి నేరుగా తండ్రి దగ్గరకు వెళ్లింది.

 

“నాన్నా! నువ్వు మాటిచ్చావు కదా!”

 

నరసింహం కళ్లలో బాధ.

 

“క్షమించమ్మా.”

 

ఆ ఒక్క మాటతో వైదేహి మనసులో ఏదో విరిగిపోయింది.

 

“నా చదువు సంగతేంటి?”

 

“పెళ్లయ్యాక చూద్దాం.”

 

“అందరూ అదే అంటున్నారు నాన్నా. కానీ నా కల గురించి ఒక్కరూ ఆలోచించడం లేదు.”

 

నరసింహం దగ్గరకు వచ్చి ఆమె తల మీద చేయి పెట్టబోయాడు. వైదేహి వెనక్కి అడుగు వేసింది.

 

ఆయన మొదటిసారి తన కూతురి కళ్లలో తనపై కోపాన్ని చూశాడు.

 

ఆమె గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది.

 

బల్ల మీద ఉన్న పుస్తకాలన్నింటినీ చూసింది. తన భవిష్యత్తు అంతా వాటి మధ్యే ఉన్నట్లు అనిపించింది.

 

ఆమె పుస్తకాల మీద చేయి పెట్టి మెల్లగా ఏడ్చింది.

 

ఆ రాత్రి తన చిన్న డైరీలో ఒక వాక్యం రాసుకుంది.

 

“ఒకరోజు నేను నా కాళ్ల మీద నిలబడతాను. అప్పుడు నా జీవితాన్ని ఎవరు నిర్ణయించాలో నేనే నిర్ణయించుకుంటాను.”

 

ఆ డైరీని పుస్తకాల మధ్య దాచిపెట్టింది.

 

ఆమెకు తెలియదు—ఆ చిన్న వాక్యం ఒకరోజు తన జీవితానికే కాదు, ఒక గ్రామ భవిష్యత్తుకూ పునాది అవుతుందని.

 

పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.

 

ఇంటికి బంధువులు వస్తున్నారు. కొత్త బట్టలు కొంటున్నారు. వంటల గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో అందరూ హడావుడిగా ఉన్నారు.

 

కానీ వైదేహికి మాత్రం ఆ ఇంట్లో తనకు సంబంధించినది ఏమీ కనిపించలేదు.

 

ఆమె చదువుకునే బల్లను గోడకు ఆనించి పక్కకు జరిపేశారు. పుస్తకాలను ఒక పెట్టెలో పెట్టేశారు. గోడ మీద వేలాడుతున్న పాఠశాల బహుమతి పత్రం కూడా కనిపించకుండా పోయింది.

 

పెళ్లికి మూడు రోజుల ముందు శాంతమ్మ ఇంటికి వచ్చింది.

 

వైదేహిని చూసి ఆమె కాసేపు మౌనంగా నిలబడిపోయింది.

 

“వైదేహి, నిజంగానే పెళ్లి చేసేస్తున్నారా?”

 

వైదేహి తలదించుకుంది.

 

“నాకు ఇష్టం లేదు టీచర్.”

 

శాంతమ్మ ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది.

 

“నీకు చదువుకోవాలని ఉందని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీకు అండగా నిలబడేవాళ్లు కావాలి.”

 

“నాకెవరూ లేరు టీచర్.”

 

ఆ మాట విన్న శాంతమ్మ గుండె బరువెక్కింది.

 

“అలా అనకు. నీలో ఉన్న తెలివిని ఎవరూ తీసుకోలేరు. పుస్తకాలు పక్కన పెట్టాల్సి వచ్చినా, నేర్చుకోవడం మాత్రం ఆపకు.”

 

వైదేహి ఆమెను హత్తుకుని ఏడ్చింది.

 

శాంతమ్మ వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ మాటలు ఆమె చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి.

 

పెళ్లికి ముందు రోజు రాత్రి వైదేహి తన పుస్తకాల పెట్టెను తెరిచింది. తనకు ఇష్టమైన తెలుగు పుస్తకాన్ని బయటకు తీసింది. దాని మొదటి పేజీలో తన పేరు రాసి ఉంది.

 

“వైదేహి — పదో తరగతి.”

 

ఆమె ఆ అక్షరాలను వేళ్లతో తడిమింది.

 

తర్వాత పుస్తకాన్ని ముద్దుపెట్టి మళ్లీ పెట్టెలో పెట్టింది.

 

బయట పెళ్లి పందిరి కడుతున్నారు.

 

ఇంట్లో మంగళవాయిద్యాల సాధన వినిపిస్తోంది.

 

అందరూ ఆమె కొత్త జీవితానికి సిద్ధమవుతున్నారు.

 

కానీ వైదేహి మాత్రం తన పాత జీవితానికి వీడ్కోలు చెప్పలేకపోతోంది.

 

ఆమె కిటికీ దగ్గరకు వెళ్లి ఆకాశం వైపు చూసింది.

 

“దేవుడా! నాకు ఏం కావాలో నీకు తెలుసు. నా జీవితం ఎలా ఉండబోతోందో నాకు తెలియదు. కానీ ఒక్కరోజైనా నా కలను నిజం చేసుకునే అవకాశం ఇవ్వు.”

 

ఆమె కళ్ల నుంచి ఒక కన్నీటి చుక్క జారింది.

 

ఆ చుక్క కింద ఉన్న పుస్తకం మీద పడింది.

 

మరుసటి రోజు ఉదయం వైదేహి పెళ్లికూతురిగా అలంకరించబడింది.

 

అద్దంలో తనను తాను చూసుకుంది.

 

నుదుటిపై బొట్టు, మెడలో నగలు, చేతులకు గాజులు, పట్టుచీర—అన్నీ ఉన్నాయి.

 

కానీ ఆమె కళ్లలో మాత్రం ఆనందం లేదు.

 

పెళ్లి పీటల దగ్గర కూర్చున్నప్పుడు శాంతమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది.

 

“నీ లక్ష్యాన్ని వదులుకోకూడదు.”

 

ఆమె మెల్లగా తన చేతులను బిగించింది.

 

తన జీవితంలో ఏమి ఎదురవుతుందో తెలియదు. తనను ఎవరు అర్థం చేసుకుంటారో తెలియదు. తన కలలు మళ్లీ ఎప్పుడైనా వెలుగులోకి వస్తాయో కూడా తెలియదు.

 

అయినా తన మనసులో ఒక చిన్న నమ్మకం మిగిలి ఉంది.

 

తన కథ ఇక్కడితో ముగియకూడదు.

 

పెళ్లి మంత్రాలు మొదలయ్యాయి.

 

వైదేహి తలదించుకుని కూర్చుంది.

 

ఆమె మెడలో తాళి కట్టిన క్షణంలో చుట్టూ ఉన్నవారంతా అక్షింతలు చల్లారు.

 

కెమెరాలు ఆ సన్నివేశని బందించాయి. బంధువులు ఆనందంగా చప్పట్లు కొట్టారు.

 

ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

 

కానీ ఆ అధ్యాయం ఆమె కలల వైపు తీసుకెళ్తుందా, లేక వాటికి మరింత దూరం చేస్తుందా?

 

ఆ సమాధానం కాలమే చెప్పాలి.

 

కొనసాగుతుంది…

 

ఎలా ఉంది ఎపిసోడ్? కంటిన్యూ చెయ్యమంటారా?

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…