ఆమె ఇంకా అక్కడే ఉంది… – 1
అనుకోని పిలుపు..
“కొన్ని ప్రయాణాలు మనం ఎంచుకుంటాం… కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్నే ఎంచుకుంటాయి.”
హైదరాబాద్ నగరం…
ఉదయం ఆరు గంటలు.
రాత్రి కురిసిన వర్షపు జల్లుల తడి ఇంకా రోడ్ల పై మెరుస్తూనే ఉంది. టీ దుకాణాల దగ్గర నుంచి ఎగిసిపడుతున్న ఆవిరి, వార్తాపత్రికలు పంచుతున్న జనాలు, నిద్ర లేచిన పక్షుల కిల కిలారావాలు… నగరం ఇంకొన్ని నిమిషాల్లో తన పరుగును మొదలు పెట్టబోతోంది..
అయితే…
ఆ నగరంలో ఒక అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో మాత్రం సమయం ముందుకు కదలడం మానేసినట్టుంది.
ల్యాప్‌టాప్ ముందు నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఒక అబ్బాయి.
అతని పేరు ఆద్వైత్.. తెలుగు సాహిత్యంలో తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న యువ రచయిత.
అతని కథలు చదివి నవ్వినవాళ్లు ఉన్నారు…
ఏడ్చినవాళ్లు ఉన్నారు…
వేలాది మంది అభిమానులు…
ప్రతి కొత్త నవల కోసం ఎదురు చూసే పాఠకులు ఉన్నారు…
కానీ ఈ ఉదయం…
తన కథ మాత్రం అతనికి దొరకడం లేదు.
స్క్రీన్ పై ఒకే ఒక్క లైన్.
Chapter – 17
దాని కింద…
ఖాళీ తెల్లని పేజీ.
మూడు గంటలుగా అదే చూస్తున్నాడు.
కాఫీ చల్లారిపోయింది. అతని మనసు అలసిపోయింది.
“కథలు కూడా మనుషుల్లాగే… పిలిస్తే రావు…
రావాలి అనిపిస్తేనే వస్తాయి” అని అంటూ తనలో తానే నవ్వుకున్నాడు ఆద్వైత్..
అతను ల్యాప్‌టాప్ మూసి, నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వెళ్లాడు.
దూరంగా ఆకాశాన్ని చూస్తూ…
“అసలు ఈ కథలు ఎక్కడ దాక్కుంటాయో…” అన్నాడు. మళ్ళీ తన మాటలకి తనలో తానే నవ్వుకున్నాడు.
అప్పుడే…
గాలి ఒక్కసారిగా బలంగా వీచింది.
ఆ గాలితో పాటు…
మల్లెపూల పరిమళం.
ఆద్వైత్ కనుబొమ్మలు ముడుచుకున్నాడు.
తన బాల్కనీలో మల్లె చెట్టు లేదు. చుట్టు పక్కల ఎక్కడా కూడా లేదు.
అయినా… ఆ వాసన స్పష్టంగా అతన్ని తాకింది.
ఒక్క క్షణం…
ఎందుకో…
ఎవరో తన వెనకాల నిలబడి ఉన్నట్టుగా అనిపించింది.
వెంటనే వెనక్కి తిరిగాడు.
ఎవరూ లేరు.
“ఓవర్ గా ఆలోచిస్తున్నావ్ ఆద్వైత్…”
అని తనను తానే మందలించుకున్నాడు.
బాల్కనీలో నుంచి కిందకు చూసాడు ఆద్వైత్..
కింద నగరం పరుగులు తీస్తోంది. ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యం కోసం జీవిస్తున్నాడు.
కానీ…
ఒక రచయిత లక్ష్యం మాత్రం విచిత్రంగా ఉంటుంది.
అతను… ఇతరుల జీవితాల్లో కథలను వెతుకుతాడు.
కొన్ని సార్లు…
తన జీవితంలోనే కథ దాక్కుని ఉందని కూడా గుర్తించలేడు.
నాగరాన్ని చూస్తూ ఆలోచనలో ఉన్న ఆద్వైత్ కి ఎవరో తన పక్కనే నిలబడి, ఇప్పుడే వెళ్లిపోయినట్టుగా అనిపించింది.
అతను లోపలికి అడుగు పెట్టబోతుండగా…
టింగ్… టాంగ్…
డోర్ బెల్ మోగింది..
అదే సమయంలో…
వేలగూడెం..
వర్షం పడబోతున్న సూచనగా ఆకాశమంతా నల్లటి మేఘాలు గ్రామం మొత్తాన్ని కప్పేశాయి.
గాలికి ఊగుతున్న పెద్ద పెద్ద మర్రి చెట్లు.
గ్రామం చివర.. కాలం మరిచిపోయినట్టుగా నిలబడి ఉన్న ఒక పాత బంగ్లా.
కాలం దాన్ని మరిచిపోయినా…
అది మాత్రం ఎవరినో మర్చిపోలేదు.
ఆ ఇంటి రెండో అంతస్తు కిటికీ పక్కన…
ఒక అమ్మాయి నిలబడి ఉంది.
ఆమె నడుం వరకు జాలువారిన నల్లని జుట్టు గాలికి మెల్లగా ఎగురుతోంది.
వెన్నెలలాంటి పాలవర్ణ ముఖం…
నుదుటి పై చిన్న నల్లని బొట్టు…
ఆ పెద్ద పెద్ద కళ్లలో ఎన్నో సంవత్సరాల ఎదురు చూపు.
ఆమె చేతిలో…
ఒక హృదయాకార వెండి లాకెట్.
దాన్ని గుండెలకు హత్తుకుని… కిటికీ బయట దూరంగా వెళ్లే మట్టి రోడ్డు వైపు చూస్తూ..
“ఈసారి… మీరు తప్పకుండా వస్తారు…” అంది.
ఆమె గొంతు చాలా మెల్లగా ఉన్నా… ఆమె ప్రతి మాట ఆ ఇంటి గోడలన్నీ విన్నట్టుగా అనిపించింది.
అప్పుడే…
వెనకాల ఉన్న పాత ఊయల తనంతట తానే కదిలింది..
కీచ్…
కీచ్…
కీచ్…
గాలి లేదు.
ఎవరూ లేరు.
అయినా…
ఊయల మెల్లగా ఊగుతోంది..
ఆ అమ్మాయి మాత్రం…
వెనక్కి తిరిగి కూడా చూడలేదు.
ఆమెకు అది కొత్త కాదు. నెమ్మదిగా కళ్లు మూసుకుని..
“ఇంకా ఎంతకాలం నన్ను ఇక్కడే బంధిస్తావు…?”
అని ఎవరినో అడిగినట్టుగా అంది ఆమె మాట.
ఆ క్షణంలో…
ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.
ఇటు హైదరాబాద్…
కాలింగ్ బెల్ సౌండ్ కి ఆద్వైత్ తలుపు తెరిచాడు.
బయట ఒక కొరియర్ బాయ్ నిలబడి ఉన్నాడు.
“ఆద్వైత్ గారేనా?” అని అడిగాడు.
ఆద్వైత్ తల ఊపుతూ.. “అవును” అన్నాడు.
“మీకు ఒక కవర్ వచ్చింది” అన్నాడు కొరియర్ బాయ్.
అతను కవర్ తీసుకున్నాడు.
కొరియర్ బాయ్ అందించిన కవర్ చూసిన క్షణమే…
ఆద్వైత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి.
అది పాత పసుపు రంగు కవర్. మూలలు కొద్దిగా చిరిగిపోయాయి. అది ఇప్పుడే పోస్టు చేసిన కవర్ లా కాకుండా… ఎన్నో సంవత్సరాలుగా ఎవరో జాగ్రత్తగా దాచి పెట్టినట్టు ఉంది.
దానిపై అతని పేరు మాత్రమే ఉంది.
పంపినవారి పేరు లేదు, చిరునామా కూడా లేదు.
“ఎవరు పంపారు?” అని అడిగాడు ఆద్వైత్.
కొరియర్ బాయ్ భుజాలు ఎగరేసి..
“పంపిన వారి పేరు లేదు సర్… మాకు కూడా ఈ అడ్రస్ మాత్రమే ఇచ్చారు” అని చెప్పి వెళ్లిపోయాడు.
అతను వెళ్ళిపోయాక తలుపు మూసిన తర్వాత కూడా… ఆద్వైత్ చూపు ఆ కవర్ పైనే ఉంది.
ఎందుకో…
దాన్ని తెరవక ముందే దాని లోపల ఏముందో తెలుసుకోవాలనే ఆత్రుత కంటే.. తెలియని భయం ఎక్కువగా అనిపించింది.
అతను నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు.
కవర్ ను జాగ్రత్తగా తెరిచాడు..
లోపల…
ఒక తెల్లటి కాగితం.
అంతే ఇంకేమి లేదు.
దాన్ని బయటకు తీశాడు.
నల్లటి సిరాతో చాలా అందమైన చేతి రాతలో కేవలం ఒకే వాక్యం రాసి ఉంది..
“మీరు వెతుకుతున్న కథ… మీ కోసం వేలగూడెం లో ఎదురు చూస్తోంది.”
ఆ వాక్యం కింద…
ఒక చిన్న హృదయాకార వెండి లాకెట్ బొమ్మ.
ఆ బొమ్మ కనిపించిన క్షణంలో…
ఆద్వైత్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.
ఆ లాకెట్…
అతను ఇంతకు ముందు చూసాడు.
కానీ…
ఎక్కడ?
ఎప్పుడు?
అతని కళ్ల ముందు ఒక్కసారిగా ఒక చిన్న జ్ఞాపకం మెరుపులా మెరిసింది..
భారీ వర్షం…
తెల్లటి చీరలో ఒక అమ్మాయి…
ఆమె ఏడుస్తోంది…
ఆమె చేతిలో అదే లాకెట్…
ఆమె పెదవులు కదిలాయి.
“నన్ను మర్చిపోవద్దు…”
అంతే…
జ్ఞాపకం మాయమైంది.
“లేదు… ఇది నిజం కాదు…” అని ఆద్వైత్ తన తలను గట్టిగా పట్టుకున్నాడు.
ఆ జ్ఞాపకం ఒక్క క్షణంలోనే మాయమైంది.
అది కలా?
జ్ఞాపకమా?
అతనికే అర్థం కాలేదు.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించింది.
ఆ లేఖ… అతన్ని పిలవలేదు.
అతన్ని వెతుక్కుంటూ వచ్చింది.
అతను లోతుగా ఊపిరి తీసుకున్నాడు.
“వేలగూడెం… నేను వస్తున్నాను” అని నెమ్మదిగా అన్నాడు.
అటు వేలగూడెం…
ఆ అమ్మాయి ఒక్కసారిగా తలెత్తి చూసింది.
ఎందుకో…
ఆమె కళ్లలో ఆనందం మెరిసింది.
“ఆయన బయలు దేరారు…” అని చిరునవ్వుతో చెప్పింది.
అప్పుడే…
ఆమె వెనకాల నుంచి…
ఒక గంభీరమైన పురుష స్వరం వినిపించింది.
“ఈసారి కూడా… అతన్ని కాపాడగలనని అనుకుంటున్నావా…?” అని గట్టిగా అన్నాడు..
ఆ అమ్మాయి ముఖం పై ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది…
***
ఆ రచయిత కి తాను అనుకున్న కథ వేలగూడెం లో దొరకనుందా??
అసలు ఆ అమ్మాయి ఎవరు?
ఆమెకు, ఆ రచయితకు మధ్య ఏమైనా సంభందం ఉండి ఉంటుందా??
వీటన్నిటికీ సమాధానాలు మరియు తరువాత జరిగేది తెలుసుకోవాలి అంటే ఆమె ఇంకా అక్కడే ఉంది… కథ ను, నన్ను ఫాలో ఐపోండి..
sp ✍️… writes
Swipe left/right or tap the sides to turn pages